Translate

Sunday, 23 April 2017

ఈ 13 టిప్స్ పాటిస్తే… ఏసీ, కూల‌ర్ అవ‌స‌రం లేకున్నా ఇంట్లో చ‌ల్ల‌గా ఉండ‌వ‌చ్చు..!

ఓ వైపు ఎండ‌లు మండిపోతున్నాయి. మరో వైపు ఉక్క‌పోత‌, వేడిమి వ‌ల్ల జ‌నాలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడికి త‌ట్టుకోలేక ప్ర‌జ‌లు చ‌ల్ల‌ని మార్గాల వైపు దృష్టి పెడుతున్నారు. శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకోవ‌డం కోసం నానా తంటాలు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే చ‌ల్ల‌ని ద్ర‌వాల‌ను తీసుకోవ‌డం, రెండు పూట‌లా స్నానం చేయ‌డం, చ‌ల్ల‌ద‌నాన్నిచ్చే ఆహారం తిన‌డం వంటి ప‌నులు చేస్తున్నారు. అయితే ఇంత వ‌ర‌కు ఓకే. కానీ ఇండ్ల‌లో చ‌ల్ల‌ద‌నం విష‌యానికి వ‌స్తే మాత్రం చాలా మందికి ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. ఏసీలు ఉన్నా అవి అంద‌రికీ అందుబాటులో ఉండ‌వు క‌దా. ఇక కూల‌ర్లు ఉంటాయి, కానీ వాటిని కూడా నిరంత‌రాయంగా న‌డిపించ‌లేం క‌దా. క‌రెంటు పోయిందంటే చాలు మ‌ళ్లీ ఇండ్ల‌లో వేడి దంచి కొడుతుంది. ఈ క్రమంలో కింద ఇచ్చిన ప‌లు టిప్స్ పాటిస్తే దాంతో ఇండ్ల‌లో చ‌ల్ల‌దనాన్ని పెంచుకోవ‌చ్చు. అందుకు పెద్ద‌గా ఖ‌ర్చు పెట్టాల్సిన ప‌ని కూడా ఉండదు. వీటితో ఇంట్లో ఎంచ‌క్కా చ‌ల్ల‌ద‌నాన్ని అనుభ‌వించ‌వ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కిటికీలకు తెల్లటి లేదా లైట్‌ కలర్‌లోని కర్టెన్‌లను ఏర్పాటుచేసుకోవడం మంచిది. ఇవి గదుల్లోకి వచ్చే బయటి ఉష్ణోగ్రతను పూర్తిగా నిరోధిస్తాయి. ఉదయం పూట తూర్పున ఉండే కిటికీలకు కర్టెన్‌లను వేసి ఇతర దిక్కుల్లో ఉండే కర్టెన్‌లను తెరచి ఉంచాలి. దీంతో ఎండ గదుల్లోకి రాకుండా ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం పూట పడమరన ఉండే కిటికీలను కర్టెన్‌లతో మూసి ఉంచాలి. ఫలితంగా ఎండ రాకుండా ఉండి గదుల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.
2. కిటికీల బయటవైపు ఎండను నిరోధించే గ్లాసులను ఏర్పాటుచేసుకోవడం మంచిది. లేదంటే వెదురుతో తయారుచేసిన కర్టెన్‌లను ఉపయోగించవచ్చు. దీంతో ఎండ బయట నుంచి లోపలికి రాకుండా ఉంటుంది. వెదురు కర్టెన్‌ల మూలంగా కిటికీల గుండా చల్లటి గాలి ప్రవేశిస్తుంది.
3. ఇంటి పైక‌ప్పుకు తెల్లటి పెయింట్‌ వేసుకోవడం మంచిది. తెలుపు రంగు పెయింట్‌ ఎండను గ్రహించదు. దీంతో గదులు చల్లగా ఉంటాయి. ఇక కొన్ని సంవత్సరాల నుంచి గదులను చల్లగా ఉంచేందుకు మ‌న‌కు కూల్‌ హోమ్‌ వంటి పెయింట్స్‌ లభిస్తున్నాయి. ఈ పెయింట్‌ను ఇంటిపైన రూఫ్‌తో పాటు గదుల లోపల కూడా వేసుకుంటే గదులు చ‌ల్ల‌గా ఉంటాయి. అందరికీ అందుబాటు ధరల్లో ఇటువంటి పెయింట్స్‌ నేడు లభ్యమవు తున్నాయి.
4. పగటి పూట ఇంట్లోని ఉత్తరం, దక్షిణం వైపు ఉన్న కిటికీలను తెరిచి ఉంచితే గాలి ధారాళంగా వీస్తుంది. దీంతో ఇంట్లోని వేడి బయటకు వెళ్లిపోతుంది. అన్నింటికంటే ముఖ్యం ఇంటి చుట్టూ గాలినిచ్చే చెట్లను పెంచుకోవడం మంచిది. ఫలితంగా ఈ చెట్ల నుంచి వచ్చే చల్లని గాలి ఇంట్లో వారిని హాయిగా ఉంచుతుంది.
5. విండో ఎగ్జాస్ట్‌ ఫ్యాన్స్ చ‌క్క‌గా ఉపయోగపడతాయి. గదుల్లోని ఉష్ణోగ్రతను ఇవి బయటకు పంపించేందుకు ఎంత‌గానో తోడ్పడతాయి. ఈ ఫ్యాన్లను బయట వైపు ఏర్పాటుచేసుకోవాలి. వెంటిలేట‌ర్ల‌లో వీటిని ఏర్పాటు చేసుకుంటే తద్వారా ఇండ్ల‌లో ఉండే గాలి బ‌య‌టికి పోతుంది. అప్పుడు ఇల్లు చ‌ల్ల‌గా ఉంటుంది.
6. ప్రతి గదిలో ఒక కిటికీని తెరచి ఉంచడం మంచిది. దీంతో గదుల్లోకి గాలి వీస్తుంది. దీంతో పాటు ఇంటి లోపలి గదుల తలుపులను అన్నింటినీ తెరచి ఉంచాలి. ఫలితంగా అన్ని గదుల్లోకి గాలి వీస్తూ ఇల్లు చల్లగా ఉంటుంది.
7. గదుల్లో ఎయిర్‌ కూలర్స్‌ను ఏర్పాటు చేసుకోవడం మూలంగా చల్లటి గాలి వీస్తుంది. అయితే కూలర్‌ వెనకభాగం కిటికీ గుండా బయటకు ఉండేవిధంగా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో కూలర్‌ వేడి గదుల్లోకి ప్రవేశించదు.
8. కొన్ని ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల మూలంగా కూడా ఇంట్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. లైట్ల మూలంగా కూడా ఈవిధంగా జరుగుతుంది. లైట్లు, టెలివిజన్‌లు, ఉష్ణోగ్రతను కలిగించే ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఎయిర్‌ కండిషనర్‌కు, కూల‌ర్ల‌కు దూరంగా ఉండేవిధంగా చూసుకోవాలి. దీని వ‌ల్ల గ‌ది ఉష్ణోగ్ర‌త వెంట‌నే త‌గ్గుతుంది. లేదంటే ఈ ఉపకరణాల ద్వారా వచ్చే వేడి చ‌ల్ల‌ని గాలిపై ప్రభావం చూపుతుంది.
9. గదుల్లో 60 వాట్ల సాధార‌ణ బల్బులను తొలగించి వాటి స్థానంలో సీఎఫ్ఎల్ లేదా ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఈ బల్బులు ఒకేవిధమైన వెలుతురును అందించినప్పటికీ వీటి నుంచి తక్కువ ఉష్ణోగ్రత వస్తుంది. దీంతో గదుల్లో ఎక్కువగా వేడి ఉండ‌దు.
10. ఎర్రటి ఎండ ఉండే మధ్యాహ్నం పూట వంటలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. దీనివల్ల ఇంట్లో విపరీతమైన వేడి ఏర్పడుతుంది. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో వండితే కిచెన్‌లో గాలి వీచేందుకు కిటికీలను తెరుచుకోవాలి. అదేవిధంగా వంటింట్లో ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ను ఆన్‌ చేస్తే వేడి ఎప్పటికప్పుడు బయటకు వెళ్తుంది.
11. ఇంటి పరిసరాల్లో దక్షిణం, పశ్చిమం వైపున రాళ్లు, సిమెంట్‌ నిర్మా ణాలు లేకుండా చూసుకోవాలి. పగటిపూట ఇవి ఎండను గ్రహిస్తాయి. దీంతో సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత వీటి నుంచి వచ్చే వేడి గాలి కిటికీల గుండా ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
12. ఇంటి చుట్టూ గార్డెన్‌ను ఏర్పరచుకుంటే అందులో నివ‌సించే వారికి చల్లగా ఉంటుంది.
13. ఇంటి పైక‌ప్పు మీద గ్రీన్ క‌ల‌ర్ క్లాత్‌తో టెంట్ వేయాలి. అనంత‌రం దాని కింద ఉండే క‌ప్పుపై గోనె సంచులు క‌ప్పాలి. ఆ సంచుల‌ను నీటితో త‌డ‌పాలి. దీంతో ఆ ఇంట్లో చ‌ల్ల‌గా ఉంటుంది.

No comments:

Post a Comment

Case Study Of Buckingham Canal Bridge in Ongole

Case Study Of Buckingham Canal Bridge in Ongole Abstract: The  Buckingham Canal  is a 796 kilometers (494.6 mi) long  fresh water nav...